పాకిస్థాన్ మంత్రి ఖురేషి ఏం మాట్లాడుతున్నారు.. అంతా గందరగోళం..

0
66

పాకిస్థాన్ నమ్మశక్యం కాని మాటలు మాట్లాడుతోంది. భారత వాయుసేనకు చెందిన రెండో విమానాన్ని కూల్చిన పాకిస్థాన్ పైలట్‌ను కూడా గుర్తించామని.. అతడి పేరు నౌమాన్ అలీ ఖాన్ అని.. పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి గొప్పగా చెప్పుకున్నారు. పాక్ ఎయిర్ ఫోర్స్‌లో వింగ్ కమాండర్ అంటూ ప్రగల్భాలు పలికారు.

మొన్నటికి మొన్న భారత వాయుసేనకు చెందిన ఇద్దరు పైలట్లను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించి మాట మార్చిన పాకిస్థాన్ కొత్త డ్రామాకు తెరలేపింది.

పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ గగనతల ఉల్లంఘనలకు పాల్పడిన రెండు ఐఏఎఫ్ విమానాలను కూల్చివేసింది. ఒక విమానాన్ని స్క్వాడ్రన్ లీడర్ సిద్ధిఖీ కూల్చేశారు. రెండో విమానాన్ని వింగ్ కమాండర్ నౌమాన్ అలీ ఖాన్ నేలకూల్చారని మెహమూద్ ఖురేషి ప్రకటించారు.

అయితే పాకిస్థాన్ మంత్రి ఖురేషీ మాటలు నమ్మశక్యం కాలేదు. కూలిపోయిన రెండు విమానాల్లో ఒకదాని పైలట్ అభినందన్ కాగా, రెండో విమానం పైలట్ ఎవరన్నది ఆయనకే తెలియాలి.

పాక్ విమాన పైలట్‌ను కూడా భారత్‌కు చెందినవాడనుకుని పాక్ ప్రజలు చితకబాదడంతో అతడు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు ఖురేషీ పొంతన లేని విషయాలు చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నట్టు అర్థమవుతోంది.