#స్త్రీ
బీజమే వేరులై
భూమి చీల్చుకొని పుట్టి
మొక్కై, చెట్టై, కొమ్మై….
నువ్వు ఏడ్చేవేళ
లాలిపాడే చల్లని చిరుగాలై,
తప్పటడుగులు వేసే నిన్ను
కొమ్మై వంగి నడిపించే శక్తి మయమై,
నీకు ఆకలేస్తే అన్నమై,
ఒక్కోక్క అడుగు ఎదిగే నిన్ను చూసి
గర్వంగా తలెత్తుకు నిలిచే ఆనందమై,
నీ జీవితంలో ప్రతి అంకంలో
ఒక్కో రూపంలో నీకు తోడై, నీడై,
చివరి వరకు నీ అడుగులో అడుగై…..
నిత్యం నీకోసమే తపనపడే
నీలో సగమైన మహాశక్తికి
నువ్విచ్చే వరం……దహనం
హృదయాన్ని దహిస్తావ్,
శరీరాన్ని దహిస్తావ్,
కానీ, నీకు తెలీదు
నువ్వు కూర్చున్న చెట్టుని
నువ్వే నరుక్కుంటున్నావ్
– పద్మజ నాగభైరవ