పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వేలకోట్లకు మోసగించి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ లండన్ వీధుల్లో యధేచ్చగా తిరుగుతున్నాడు. ఈ మేరకు బ్రిటిష్ న్యూస్‌పేపర్ ది టెలిగ్రాఫ్ ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. లండన్‌లోని వెస్ట్ ఎండ్ వీధిలో నీరవ్‌మోదీని టెలిగ్రాఫ్ పాత్రికేయుడు గుర్తించి పలు ప్రశ్నలు సంధించాడు.
అన్నింటికి నీరవ్ ‘నోకామెంట్’ అంటూ సమాధానమిచ్చాడు. పాత్రికేయుడి నుంచి తప్పించుకునేందుకు నీరవ్ ప్రయత్నించాడు. తొలుత ఓ క్యాబ్ ఎక్కేందుకు ప్రయత్నించగా ఆ క్యాబ్ డ్రైవర్ నిరాకరించాడు. అనంతరం మరో క్యాబ్‌లో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆ సమయంలో అతను ధరించిన కోటు విలువ దాదాపు ఏడు లక్షల రూపాయలుంటుందని అంచనా. లండన్‌లోని సెంటర్ పాయింట్ టవర్ బ్లాక్‌లోని మూడు పడక గదుల నివాసంలో నీరవ్ ఉంటున్నాడు. దీనికి నెలకు రూ.15 లక్షలుపైగా అద్దె ఉంటుందని సమాచారం. నీరవ్‌కు సంబంధించి రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియోను టెలిగ్రాఫ్ సంస్థ విడుదల చేసింది. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.