భారత్-పాకిస్థాన్‌ల మధ్య శాంతియుత చర్చలకు అవకాశం లేనట్లే కనిపిస్తోంది. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. ఉగ్రమూకల దాడిని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు. ఇందుకు పుల్వామా తరహా మరో ఆత్మాహుతి దాడికి జైషే మొహమ్మద్ సిద్ధమైందని నిఘా వర్గాలు హెచ్చరించడమే నిదర్శనం.
పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది.
తాజాగా, పుల్వామా తరహా మరో దాడికి జైషే స్కెచ్ వేసిందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. రానున్న 3, 4 రోజుల్లో జమ్ముకాశ్మీర్‌లో దాడి చేసేందుకు జైషే యత్నిస్తోందని తెలిపింది. బాలాకోట్ దాడికి ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడనున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈసారి టాటా సుమో వాహనాన్ని మానవబాంబులు వాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జమ్ముకాశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేసి.. హై అలెర్ట్ ప్రకటించారు.