ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 18వ తేదీన విడుదల కానుంది. మార్చి 26న నామినేషన్లు పరిశీలిస్తారు. మార్చి 28వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఫలితాలు మాత్రం దేశ వ్యాప్తంగా అన్ని దశల పోలింగ్ పూర్తయిన తర్వాత మే 23న విడుదల చేస్తారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి దశలోనే పోలింగ్ జరుగనుండటంతో పార్టీలకు నెలరోజుల సమయం మాత్రమే వుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో తలమునకలుగా వున్న ప్రధాన పార్టీల వెనువెంటనే పూర్తిస్థాయిలో ప్రచార పర్వంలో దిగేందుకు సన్నద్ధమవుతున్నాయి.
ఇకపోతే.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకే దశలో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు, తెలంగాణలోని 17లోక్‌సభ స్థానాలకూ ఏప్రిల్ 11నే ఎన్నికలు జరగనున్నాయి. 2014లో తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
ఈసారి తెలంగాణలో తెరాస ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. శాసనసభా ఎన్నికల్లో తెరాస విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే.