పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో భారత్ అటో ఇటో తేల్చుకునేలా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జేషే తీవ్రవాద తండాలపై భారత వైమానికి దళం మెరుపు దాడులు జరిపింది. ఈ దాడులను జీర్ణించుకోలేని పాకిస్థాన్… భారత్‌లో ప్రతిదాడులకు యత్నించగా, వాటిని భారత వాయుసేన సమర్థవంతంగా తిప్పకొట్టింది.
అదేసమయంలో గత నెల 26వ తేదీన భారత్ నిర్వహించిన దాడుల తర్వాత పాక్ తమ గగన తలాన్ని మూసివేసింది. దీంతో ఆసియా, ఐరోపా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు వేలాదిమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడు మూసేసిన తమ గగన తలాన్ని ఈ 9వ తేదీన తిరిగి తెరవనున్నట్టు ప్రకటించింది. అయితే, అంతలోనే మరో ప్రకటన చేసింది.
సోమవారం (11వ తేదీ) మధ్యాహ్నం మూడు గంటల వరకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్టు పాకిస్థాన్ పౌర విమానయాన సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయ ట్రాన్సిట్ విమానాలు తమ భూభాగంలో ప్రవేశించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే, ఉత్తర, దక్షిణ మార్గాల ద్వారా ముందుగా నిర్ణయించిన విమానాలకు మాత్రం అనుమతి ఉన్నట్లు తెలిపింది.