జాతీయగీతం సినిమా హాళ్లలోనే ఎందుకు ప్లే చేయాలి?

0
52

జాతీయ గీతాన్ని సినిమా హాళ్లలో ఆలపించడంపై జనసేనాని పవన్ కల్యాణ్ నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమా హాళ్లలో జాతీయగీతం వస్తుంటే లేచి నిలబడడం తనకు నచ్చని విషయం అని పవర్ స్టార్ కుండబద్ధలు కొట్టినట్లు తేల్చి చెప్పేశారు.

స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేసేందుకు వెళ్తే.. అక్కడ దేశానికి గౌరవాన్నిచ్చే జాతీయ గీతాన్ని ఆలపించేలా చేయడం సబబు కాదన్నారు. ప్రస్తుతం ఎంజాయ్ చేసేందుకు వుపయోగపడే సినిమా థియేటర్లు కాస్తా.. ప్రస్తుతం దేశభక్తి నిరూపించుకునేందుకు వేదికలుగా మారాయని విమర్శలు గుప్పించారు.

జాతీయగీతం సినిమాహాళ్లలోనే ఎందుకు ప్లే చేయాలి? రాజకీయనాయకులు తమ సభలకు ముందు జాతీయగీతం ప్లే చేయొచ్చుగా అంటూ ప్రశ్నించారు. అలాకాకుంటే ప్రతీ కార్యాలయాల్లోనూ జాతీయ గీతం పాడేలా చూడాలని.. తొలుత మార్గదర్శకాలను సూచిస్తూ చట్టాలు తీసుకువచ్చే వాళ్లే మొదట ఈ పని చేసి అందరికీ మార్గదర్శకంగా నిలవాలని పవన్ ఫైర్ అయ్యారు.

కాగా.. దేశవ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లలో ప్రతి సినిమా ఆట ప్రదర్శనకు ముందు జాతీయ గీతం ‘జనగణమన’ వినిపించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తెరపై జాతీయ పతాకాన్ని ప్రదర్శించాలని, గౌరవసూచకంగా ప్రేక్షకులంతా లేచి నిలబడాలని స్పష్టం చేసింది.