పసిడి ధర పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగిరావడంతో పాటు దేశీయంగా ఈ లోహానికి రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో వారాంతంలో పసిడి ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం వుంది. ఈ ధరల క్షీణత మరో వారం వరకు వుండవచ్చునని తెలుస్తోంది.
మరోవైపు వెండి ధరల్లో భారీగా పెరుగుదల నమోదయ్యింది. శనివారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.100 తగ్గి వరుసగా రూ.33,170, రూ.33,000గా పలికింది.
విదేశీ బలహీన ధోరణి, స్థానిక నగల వర్తకులనుంచి డిమాండ్ క్షీణించడం దేశీయ మార్కెట్లో పుత్తడి ధరలు పడిపోయాయని వర్తకులు తెలిపారు. అలాగే డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బలపడుతూ వుండటం కూడా పసిడి ధరలపై ఒత్తడి పెంచినట్టు వర్తకులు అంచనా వేస్తున్నారు.