అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ నటి జయసుధ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈసీ ఎన్నికల నగారా మోగించిన వేళ.. వైకాపాలోకి వచ్చి చేరే సభ్యుల సంఖ్య పెరిగిపోతుంది. సినీ నటి జయసుధకు తర్వాత.. మరో ప్రముఖ హాస్యనటుడు అలీ వైకాపా తీర్థం పుచ్చుకోనున్నారని టాక్ వస్తోంది.
ఇప్పటికే టీడీపీ, జనసేన అధినేతలను కలిసిన అలీ ప్రత్యక్ష రాజకీయాల్లో రంగప్రవేశానికి వైసీపీనే సరైన వేదికగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం లోటస్ పాండ్‌లో పార్టీ అధినేత జగన్ సమక్షంలో అలీ వైసీపీ సభ్యత్వం స్వీకరించనున్నారని వైకాపా శ్రేణుల సమాచారం.
జగన్ సోమవారం నాడు కాకినాడలో సమర శంఖారావం సభకు వెళ్లాల్సి ఉండడంతో.. అలీని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం జగన్ కాకినాడ పయనం అవుతారని టాక్ వస్తోంది. జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో కూడా అలీ స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు.
ఇకపోతే.. అలీ జగన్‌ను కలవడంతో ఆయన వైకాపాలో చేరనున్నట్లు కలకలం రేగింది. అయితే అటు పిమ్మట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్‌ను కూడా ఆయన కలవడంతో వైకాపాలో అలీ చేరికపై వార్తలకు పెద్దగా బలం చేకూరలేదు.
కానీ, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న అలీకి టీడీపీలో తగిన హామీ దొరకలేదని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. అయితే, వైసీపీలో చేరుతున్న అలీ ఎక్కడ నుంచి పోటీచేస్తారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.