కమల్ హాసన్‌కు ”టార్చిలైట్” ఇచ్చారుగా…

0
48

తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సినీ లెజెండ్ కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తమిళనాట రాజకీయాల్లో రాణించేందుకు బరిలోకి దిగారు. వీరిద్దరి మధ్య పోటీ నెలకొనే అవకాశం వుందని టాక్ వస్తోంది.

ఈ నేపథ్యంలో మక్కల్ నీది మయ్యంను గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కమల్ పార్టీకి ‘టార్చ్ లైట్’ గుర్తును కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఇక తమ పార్టీకి టార్చ్ లైట్ గుర్తును కేటాయించడంపై కమలహాసన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ పార్టీకి సరైన గుర్తు అని వ్యాఖ్యానించారు.

తమిళనాడుతో పాటు భారత రాజకీయాల్లో సరికొత్త శకానికి ఎంఎన్ఎం, బ్యాటరీ టార్చ్ నాంది పలుకుతాయని అభిప్రాయపడ్డారు. కాగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 39 స్థానాల నుంచి పోటీ చేస్తామని కమల్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే పార్టీని బలోపేతం చేసే దిశగా కమల్ హాసన్ ముందుకు సాగిపోతున్నారు.

ఇందులో భాగంగా పార్టీలోకి వచ్చే తారలను, ప్రముఖులను, యువకులను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ హాస్యనటి కోవై సరళ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. శుక్రవారం కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీధి మయ్యంలో చేరారు. కమల్‌ కోవై సరళను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సభ్యత్వాన్ని అందుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కమల్ పార్టీ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు.

రోవైపు కోవై సరళ చేరిక తమకు కలిసొస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కోయంబత్తూరు పరిసర కొంగునాడు ప్రాంతంలో కొంత బలాన్నిస్తుందంటున్నారు.

అంతేకాదు హాస్య నటిగా గుర్తింపు పొందిన కోవై సరళ మంచి వక్త కూడా.. ఎన్నికల ప్రచారంలో తన ప్రసంగంతో ఆకట్టుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే.. కమల్‌హాసన్‌-కోవై సరళ కాంబినేషన్‌లో వచ్చిన సతీలీలావతి సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి విదితమే.