టాలీవుడ్ హాస్య నటుడు అలీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఉన్న జగన్ నివాసంలో ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.
వైకాపాలో చేరిన తర్వాత అలీ మాట్లాడుతూ, తాను సినిమాల్లో ఎన్టీఆర్‌కు అభిమానినని, రాజకీయాల్లో మాత్రం వైఎస్.రాజశేఖర్ రెడ్డికి అభిమానినన్నారు. వైఎస్సార్ తనయుడు జగన్ నడిపిస్తున్న వైసీపీ విధివిధానాలు నచ్చడంతోనే ఆ పార్టీలో జాయిన్ అయ్యానని వెల్లడించారు.
అయితే అంతకుముందు తనకు, పవన్ కల్యాణ్‌కు మధ్య జరిగిన సంభాషణను కూడా అలీ ఈ సందర్భంగా బయటపెట్టారు. గతంలో తాను జనసేన పార్టీలో చేరాలని ప్రయత్నిస్తే పవన్ కల్యాణే వద్దన్నాడని చెప్పారు. రాజకీయాల్లో తనతో కలిసి నడిస్తే ఎన్నో ఇబ్బందులు ఉంటాయని, స్నేహితులను సమస్యల పాల్జేయడం ఇష్టంలేదని అన్నాడని వివరించారు.
పైగా, నీకిష్టం వచ్చిన పార్టీలో చేరు అని పవన్ ఇచ్చిన సలహాతోనే స్వేచ్ఛగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నానని అలీ వెల్లడించారు. అంతేతప్ప, పవన్‌ను కాదని తాను వైసీపీలోకి వెళ్లినట్టు కాదని స్పష్టంచేశారు. దీన్ని ఫ్యాన్స్ తప్పుగా అర్థం చేసుకోరని భావిస్తున్నానని, ఒకవేళ ఎవరైనా ట్రోల్ చేస్తే వాళ్లకే నష్టం అని అన్నారు.