ఇథియోపియాలో విమాన ప్రమాదం… మృతుల్లో తెలుగమ్మాయి

Four Indians among 157 killed as Ethiopian Airlines flight crashes

0
45
Ethiopian Airlines Flight Crash
Ethiopian Airlines Flight Crash

ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు తెలుగమ్మాయితో పాటు నలుగురు భారతీయులు కూడా ఉన్నారు.

ఇథియోపియాకు చెందిన ఎయిర్‌లైన్ విమానం బోయింగ్ 737-800 మాక్స్ ఆదివారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 8.38 గంటలకు రాజధాని అడ్డిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబీకి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన ఆరు నిమిషాలకే విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటన బిషఫ్‌తు ప్రాంతానికి సమీపంలో చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంపై ఎయిర్‌లైన్స్ అధికార వర్గాలు మాట్లాడుతూ విమానం గాలిలోకి ఎగిరిన ఆరునిమిషాలకే కుప్పకూలిందని తెలిపాయి. ఉదయం 8.44 గంటలకు ప్రమాదం సంభవించిందని చెప్పాయి.

మరోవైపు ఇథియోపియా అధికార వార్త సంస్థ ఈబీసీ స్పందిస్తూ విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారని తెలిపింది. ప్రమాద ఘటనపై ఇథియోపియా ప్రధాని కార్యాలయం స్పందించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని పేర్కొంది. రవాణా శాఖ మంత్రి జేమ్స్ మచారియా మాట్లాడుతూ ప్రమాద విషయం తెలిసిన వెంటనే అత్యవసర సేవలను ప్రారంభించామని చెప్పారు.

మరణించిన వారిలో కెన్యాకు చెందిన 32 మంది, ఇథియోపియా 9 మంది, కెనడా 18 మంది, చైనా, అమెరికా, ఇటలీకి చెందిన 8 మంది చొప్పున, ఫ్రాన్స్‌కు చెందిన 7 మంది, బ్రిటన్ 7 మంది, ఈజిప్టు 6 మంది, నెదర్లాండ్‌కు చెందిన ఐదుగురు, భారత్, జకస్లోవేకియాకు చెందిన నలుగురు చొప్పున ఉన్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన 12మంది కూడా మరణించినవారిలో ఉన్నారు.

కాగా, ప్రమాదాన్ని పైలట్ ముందే గుర్తించాడు. విమానం గాలిలోకి ఎగిరిన కాసేపటికే పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని, విమానాన్ని వెనక్కి మళ్లిస్తానని బోయింగ్ పైలట్ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు కూడా విమానాన్ని వెనక్కి తీసుకురావడానికి క్లియరెన్స్ ఇచ్చారు. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.