కేసీఆర్‌కే అంతుంటే.. నాకెంత వుంటుంది.. చంద్రబాబు ఫైర్

0
47

ఎన్నికల నగారా మోగిన వేళ.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. విజయవాడలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డితో పాటు, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కూడా నిప్పులు చెరిగారు.

తెలంగాణ సీఎం ఓ పెద్ద నాయకుడిలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఏపీ డేటా పోతే బాధపడాల్సింది తామని, కానీ కేసీఆర్‌కు బాధ కలుగుతోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణలో 27 లక్షల ఓట్లు తీసేయిస్తే ఎవరూ మాట్లాడలేదని, కానీ ఏపీలో కూడా అదే తరహాలో దౌర్జన్యం చేయాలనుకుంటున్నాడని చంద్రబాబు మండిపడ్డారు.

కేసీఆర్ తనకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు. కానీ ఆయనకు వంద రిటర్న్ గిఫ్టులు ఇచ్చే సత్తా తన వద్ద వుందని.. తన దగ్గర పనిచేసిన కేసీఆర్‌కే అంతుంటే.. తనకెంత రోషముంటుందని చెప్పారు. హైదరాబాద్‌లో ఇవాళ ఆదాయం వస్తోందంటే అది కేసీఆఱ్ శ్రమ కాదు, మా కష్టార్జితం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అలాగే పనిలో పనిగా వైకాపా చీఫ్ జగన్‌పై కూడా చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ కరడుగట్టిన నేరస్తుడు అని, నమ్మితే జైలుకు పంపుతాడని హెచ్చరించారు. గతంలో జగన్‌తో పెట్టుబడులు పెట్టిన వాళ్లందరూ జైల్లో అతనికి రూమ్మేట్లు, బెంచ్ మేట్లు అయ్యారని ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో జగన్ అసెంబ్లీకి వచ్చిందే లేదని, మన రాజధానిలో ఉండని వ్యక్తి ఇక్కడ పోటీ చేయడం ఎందుకని చంద్రబాబు అడిగారు.