పవన్‌తో స్నేహం వేరు.. రాజకీయాలు వేరు.. పోటీ చేయను.. ప్రచారం చేస్తా.. అలీ

0
70
ali-ysrcp

ali-ysrcp

ప్రముఖ హాస్యనటుడు అలీ వైకాపా కండువా కప్పుకున్నారు. వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అలీ సోమవారం ఆ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లో జగన్‌తో పావు గంట భేటీ తర్వాత అలీకి పార్టీ కండువా వేసి పార్టీలోకి జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. వైకాపా తీర్థం పుచ్చుకున్నాక అలీ మీడియాతో మాట్లాడుతూ.. స్థానికులకు సీటు ఇవ్వకుండా అలీకి ఇస్తే.. ఇబ్బందులు ఏర్పడుతాయని జగన్ చెప్పారని.. ఆయన చెప్పినట్లు ప్రచారానికి పరిమితం అవుతానని అలీ వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా వైకాపాకు ప్రచారం చేస్తానని.. పోటీ చేసే విషయాన్ని పక్కనబెట్టారన్నారు.

తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీని కాదని వైకాపాలో చేరడానికిగల కారణాలను సినీ నటుడు అలీ వివరించారు. స్నేహం వేరు… రాజకీయాలు వేరంటూ ఒక్క ముక్కలో సమాధానం ఇచ్చారు. పవన్ సక్సెస్ అయితే సంతోషపడే వ్యక్తి తానేనని అలీ తెలిపారు. కానీ రాజకీయాల్లో తమ ఇద్దరివీ వేర్వేరు దారులన్నారు.

ఇకపోతే.. గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాలని ఆశించిన అలీ ఇటీవలే గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి తన ఓటరు నమోదు దరఖాస్తు అందించారు.

కానీ ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ అధినేత నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతోనే ఆయన లోటస్‌పాండ్‌వైపు మళ్లినట్టు భావిస్తున్నారు. అలీ గుంటూరు లేదా రాజమండ్రి నుంచి వైసీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలీ వెంట సినీ నటుడు కృష్ణుడు కూడా ఉన్నారు.