లక్ష్మీరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యేక గీతాలతో ప్రేక్షకుల హృదయాల్లో గిలిగింతలు పెట్టింది. హీరోయిన్‌గా తెలుగు చిత్రసీమలో కెరీర్‌ను ప్రారంభించిన ఈ సొగసరి చిరంజీవి, పవన్‌కల్యాణ్ లాంటి అగ్ర కథానాయకులతో ప్రత్యేక గీతాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.
తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. కిషోర్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాయ్‌లక్ష్మి మాట్లాడుతూ, తెలుగు సినిమాలకు నేనెప్పుడూ దూరం కాలేదు. కథానాయికగా సినిమా చేయలేకపోయినా ప్రత్యేక గీతాల ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాను.
ఇకపోతే, మీటూ ఉద్యమాన్ని ప్రస్తుతం అందరూ మర్చిపోయారన్నారు. ఈ ఉద్యమం వల్ల ఇండస్ట్రీలో చాలా మార్పులు వస్తాయని అంతా ఆశించారు. కానీ అలాంటివేమీ జరగలేదని చెప్పారు. తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి చాలా మంది ధైర్యంగా ముందుకొచ్చి చెప్పారు.
ప్రతీకారం ఆలోచనలతో, పబ్లిసిటీ కోసం కొందరు ఈ ఉద్యమాన్ని వాడుకోవడంతో వారు చెప్పిన దాంట్లో ఏది నిజమో, ఏది అబద్దమో ఎవరికీ అర్థంకాలేదు. కొందరి స్వార్థం వల్ల ఈ ఉద్యమం పక్కదారి పట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తొలుత బలుపు సినిమాలో ప్రత్యేక గీతంలో నటించే అవకాశం వచ్చినప్పుడు చేయనని అన్నాను. లక్కీ లక్కీ రాయ్ అంటూ పాటను నా పేరుతోనే రాశానని దర్శకుడు గోపీచంద్ పదే పదే అడగటంతో ఒప్పుకున్నాను. ఆ తర్వాత ప్రత్యేక గీతాల అవకాశాలు చాలా వచ్చాయి. సర్దార్ గబ్బర్‌సింగ్, ఖైదీ నంబర్ 150 చిత్రాలు పవన్‌కల్యాణ్, చిరంజీవి కోసమే చేశాను అని చెప్పుకొచ్చింది.