359 పరుగులు.. అయినా చితక్కొట్టారు.. భారత్‌కు షాకింగ్ ఓటమి

0
63

సొంత గడ్డపై భారత జట్టుకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా జట్టు భారత జట్టును ఓ ఆట ఆడుకుంటోంది. ఇప్పటికే భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టు ట్వంటీ-20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక వన్డే సిరీస్‌లోనూ తన సత్తా చాటుతోంది.

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన నాలుగో వన్డేలోనూ భారత్ షాకింగ్ ఓటమిని నమోదు చేసుకుంది. ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. 359 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా చేధించింది.

హ్యాండ్స్ కోంబ్ శతకం జట్టుకు విజయాన్ని సంపాదించిపెట్టింది. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఓపెనర్ శిఖర్ ధావన్ 115 బంతుల్లో 143 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (95) ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. దీంతో భారత్ 358 పరుగులు సాధించింది. అయితే 359 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా చేధిస్తుందని ఎవ్వరూ వూహించలేదు. అయితే అయితే, ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్ కోంబ్ అద్భుత పోరాటంతో మ్యాచ్‌ను దిశ మళ్లించారు.

ఖవాజా 91 పరుగులు చేయగా, హ్యాండ్స్ కోంబ్ 117 పరుగులు సాధించాడు. అయితే ఈ జోడీ అవుటవడంతో మ్యాచ్ పై భారత్ కు ఆశలు కలిగినా, ఆస్టన్ టర్నర్ ఆ ఆశలపై ఓ సుడిగాలి ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. టర్నర్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో మెరుపువేగంతో 84 పరుగులు సాధించి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు టర్నర్‌ గెలుచుకున్నాడు.

నాలుగో వన్డే మ్యాచ్ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను 2-2తో సమం చేసింది ఆసీస్. ఇక, ఇరు జట్ల మధ్య చివరి వన్డే ఢిల్లీలో మార్చి 13న జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారానే సిరీస్ ఎవరిదో తేలిపోతుంది.