ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై ఓ క్లారిటీ వచ్చింది. గతంలో అనంతపురం లేదా మరో స్థానం నుంచి పోటీ చేయవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఎన్నికల సమయం సమీపిస్తుండంతో ఆయన స్థానంపై ఓ క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు. ఏప్రిల్ 11వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లాలోని గాజువాక స్థానం నుంచి పోటీ చేయవచ్చని పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి.
మరోవైపు, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూడా విశాఖ జిల్లా నుంచే పోటీ చేయనున్నారు. లోకేశ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానంపై టీడీపీ అధిష్ఠానం స్పష్టతనిచ్చింది. తొలుత భీమిలి నుంచి పోటీచేయించాలని హైకమాండ్ భావించింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీచేస్తారనే ప్రచారం కూడా జరిగింది. స్థానిక నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత విశాఖ నార్త్ నుంచి లోకేశ్ పోటీచేస్తారని చంద్రబాబు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అసలు లోకేశ్ పోటీచేస్తారా లేదా అన్న దానిపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం కోసమని చెప్పి లోకేశ్ పోటీ నుంచి తప్పుకుంటారేమోనన్న భావం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం విశాఖ నార్త్ నుంచి బీజేపీ పక్షనేత విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భీమిలి స్థానాన్ని టీడీపీ ఇంకా పెండింగ్‌లో ఉంచింది.