పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో భారత క్రికెట్ జట్టు ఐదు వన్డేల సిరీస్‌ను ఆడుతుతోంది. ఇప్పటికే జరిగిన నాలుగు వన్డేల్లో ఇరు జట్లూ తలా రెండేసి మ్యాచ్‌లలో గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీ వేదికగా సిరీస్ ఫలితాన్ని తేల్చే ఆఖరి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్‌లో పలు మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మొహాలీ వేదికగా జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో భారత్ 350 పైచిలుకు పరుగులు చేసినప్పటికీ అనూహ్యంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు తేలిపోవడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు పరుగుల వర్షం కురిపించి మ్యాచ్‌ను గెలిపించారు. ముఖ్యంగా, కీపర్ రిషబ్ పంత్ బ్యాట్‌తో ఫర్వాలేదనిపించినా కీపింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు.
మూడు సార్లు ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను స్టంపౌట్లు చేసే అవకాశాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేదు. అలాగే, ఓ రనౌట్‌ను మిస్ చేశాడు. ఈ సందర్భంగా మ్యాచ్ జరగుతుండగానే కెప్టెన్ కోహ్లీ తీవ్ర అసహనానికి గురైన సంగతి తెలిసిందే. అయితే, ఓపెనర్ శిఖర్‌ధావన్ పంత్‌కు మద్దతుగా నిలిచాడు. ధోనీతో పంత్‌ను పోల్చడం సరికాదన్నాడు. ఏదేమైనా నాలుగో వన్డేలో పంత్ తప్పిదాలకు టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది.
ప్రస్తుతం సమ ఉజ్జీలుగా ఉండటంతో అందరి కళ్లూ ఢిల్లీ మ్యాచ్‌పై పడింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్రపంచకప్ ముందు సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం టీమ్ మేనేజ్‌మెంట్ మార్పులు చేసే అవకాశం ఉంది. తుది 11 మంది జట్టులో కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కల్దీప్ యాదవ్, బుమ్రాలకు చోటు కల్పించవచ్చని భావిస్తున్నారు.