వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రను నెగెటివ్ షేడ్‌లో చూపించారు. దీనిపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ దర్శకుడు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ఈనెల 22వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ కు టీడీపీ ఫిర్యాదు చేసిందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఈసీని కలిసి ఈ ఫిర్యాదు చేశారని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
ఈ చిత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రను నెగెటివ్ గా చూపించారని, సినిమా విడుదలైతే ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఫిర్యాదులో అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. ఏపీలో ఎన్నికలు ముగిసేంత వరకు సినిమా విడుదలను ఆపివేయాలని కోరారని చెప్పారు. మరోవైపు, ఈ చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేసేందుకు నిర్ణయించామని తెలిపారు.