నారా లోకేశ్ స్థానంపై క్లారిటీ : సాదాసీదా ఎమ్మెల్యేపై పోటీ… ఎందుకంటే..

Nara Lokesh to contest from Mangalagiri Assembly constituency

0
42
nara lokesh
nara lokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పోటీపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓ క్లారిటీ ఇచ్చారు. బుధవారం తన నేతృత్వంలో జరిగిన పార్టీ సీనియర్ నేతల సమావేశంలో అన్ని అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇందులోభాగంగా, నారా లోకేశ్‌ను మంగళగిరి స్థానం నుంచి బరిలోకి దించాలని డిసైడ్ అయ్యారట. దీనికి అనేక కారణాలు లేకపోలేదు.

మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లిలోనే చంద్రబాబు నివాసం ఉంది. ఉండవల్లి నుంచే చంద్రబాబు, లోకేష్‌, కుటుంబ సభ్యులకు ఓటు హక్కు ఉంది. అంతేకాకుండా మంగళగిరి నుంచి లోకేష్‌ను పోటీకి దింపితే ఈ ప్రభావం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉంటుందన్నది పార్టీ నేతల అభిప్రాయంగా ఉంది.

ప్రస్తుతం మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణా రెడ్డి వైసీపీ నుంచి మంగళగిరి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన టీడీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. సదావర్తి భూములపై ఆళ్ల కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు చంద్రబాబును వ్యక్తిగతంగా చికాకు పెట్టే అంశాలపై ఆయన కోర్టు మెట్లెక్కారు. ఆళ్ల వేసిన పిటీషన్లను కోర్టులు కొట్టివేసినప్పటికీ చంద్రబాబు మాత్రం పెద్ద తలనొప్పిగా మారారు.

పైగా, ఉండవల్లి, పెనుమాక ఇతర గ్రామాలు సీఆర్డీయే పరిధిలో ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వకుండా రామకృష్ణారెడ్డి అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంగళగిరిలోనే అమీతుమీ తేల్చుకోవాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో రామకృష్ణారెడ్డిని ఎదుర్కొవడానికి లోకేష్‌ను బరిలోకి దింపాలన్న యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుండగా, వాస్తవానికి నారా లోకేశ్‌ను తొలుత విశాఖపట్టణం జిల్లా భీమిలి లేదా విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దించాలని భావించారు. కానీ, లోకేష్‌ను మంగళగిరి నుంచి బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గురువారం వెల్లడించే అభ్యర్థుల తొలి జాబితాలో లోకేశ్ పేరు ఉండనుంది.