కోహ్లీ సేనపై వన్డే సిరీస్ నెగ్గిన ఆస్ట్రేలియా.. అయినా రోహిత్ శర్మ రికార్డు

0
45

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో వన్డేలో భారత్ పరాజయం పాలైంది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. చివరిదైన ఢిల్లీ వన్డేలో ఆసీస్ టీమిండియాను 35 పరుగుల తేడాతో ఓడించింది. ఫలితంగా కోహ్లీసేనపై 3-2తో వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది. అంతకుముందు 2-0తో టీ20 సిరీస్‌ గెలుపొందిన సంగతి తెలిసిందే. 273 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 237 పరుగులకు ఆలౌటైంది.

భారత ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ (56), భువనేశ్వర్‌ కుమార్‌ (46), కేదార్‌ జాదవ్‌ (44) మినహా మరెవ్వరూ రాణించలేదు. దిల్లీ కుర్రాళ్లు శిఖర్ ధావన్‌ (12), విరాట్‌ కోహ్లీ (20), రిషభ్‌ పంత్‌ (16) నిరాశపరిచారు. కానీ వికెట్లు పడుతున్నా రోహిత్‌ శర్మ నిలకడగా ఆడాడు.

విజయ్‌ శంకర్‌ (16) సైతం ఉండటంతో విజయంపై ఆశలు పోలేదు. అనవసర షాట్‌కు ప్రయత్నించి అతడు జట్టు స్కోరు 120 వద్ద ఔటయ్యాడు. 132 వద్ద రోహిత్‌, జడేజా వెంటవెంటనే పెవిలియన్‌ చేరిపోయారు. ఈ క్రమంలో కేదార్‌ జాదవ్‌ (44), భువనేశ్వర్‌ కుమార్‌ (46) అద్భుత పోరాటం చేశారు. చివర్లో చేయాల్సిన రన్‌రేట్‌ పెరగడంతో వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో భారత్‌‌కు పరాజయం తప్పలేదు. ఆస్ట్రేలియా 2009 తర్వాత భారత్‌లో వన్డే సిరీస్ గెలిచింది. అంతకుముందు ఆసీస్‌లో ఉస్మాన్ ఖవాజా (100) శతకం, పీటర్ హాండ్స్‌కాంబ్‌ (52) అర్ధశతకం సాధించారు.

ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ (27) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పీటర్ హాండ్స్‌కాంబ్‌తో కలిసి ఖాజా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అందివచ్చిన ప్రతి బంతిని బౌండరీలకు తరలిస్తూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మరోవైపు హాండ్స్‌కాంబ్ కూడా తనదైన శైలిలో చెలరేగుతూ భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ధాటిగా ఆడుతూనే హాండ్స్‌కాంబ్ కూడా ఖాజాకు చక్కటి సహకారం అందించాడు. ఈ దశలో ఖవాజా (100) తన కెరీర్‌లో రెండో సెంచరీ సాధించి, ఆ వెంటనే భువనేశ్వర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (1)ని రవీంద్ర జడేజా అవుట్ చేశాడు.

ఆ తర్వాత మార్కస్ స్టొయనిస్‌తో జతకట్టిన హాండ్స్‌కాంబ్ (52) అర్ధ సెంచ రీ పూర్తిచేసి షమీ బౌలింగ్‌లో పంత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికీ ఆస్ట్రేలియా 4 కీలక వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఈ క్రమంలో గత మ్యాచ్ హీరో ఆస్టాన్ టర్నర్ (20), స్టొయనిస్ (20), అలెక్స్ క్యారీ (3) నిరాశ పరచగా, చివర్లో జే రిచర్డ్‌సన్ (29) చెలరేగినా కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్‌తో రనౌట్ అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన ప్యాట్ కమిన్స్ (15), నాథన్ లియాన్ (1, నాటౌట్) పోరాడినా ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయ 272 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాలు 2, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

రోహిత్ శర్మ రికార్డు..

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో మరో రికార్డును అధి గమించాడు. కేవలం వన్డేల్లో 200 ఇన్నింగ్స్‌ల్లో 8000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో ఆడిగాడిగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ఈ జాబితాలో భారత్‌కే చెందని విరాట్ కోహ్లీ (175 ఇన్నింగ్స్‌లు) మొదటి స్థానంలో ఉన్నాడు.

ఇక దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డీవిలియర్స్ (182 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మ (200 ఇన్నింగ్స్‌లు) సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు.