జగన్ వెన్నుపోటు పొడిచాడు.. ఇకనైనా మారు జగన్ రెడ్డి.. వంగవీటి రాధ

0
37

ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో ఇద్దరు వైకాపా నేతలు వంగవీటి రాధాకృష్ణ, యడం బాలాజీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో వంగవీటి రాధాకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ.. జగన్ రెడ్డి ఎప్పుడూ వెన్నుపోటు గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటాడని.. కానీ తనను తమ్ముడూ అంటూనే వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు.

రాష్ట్రాన్ని దెబ్బతీసే వ్యక్తులతో కలిసిన నువ్వా విశ్వసనీయత గురించి మాట్లాడేది అంటూ వంగవీటి రాధా సూటిగా ప్రశ్నించారు. ఇకనైనా జగన్ రెడ్డి మారాలన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ తన బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ప్రజలు తప్పకుండా జగన్‌కు మళ్లీ ప్రతిపక్ష నేత హోదా అందిస్తారంటూ రాధా సెటైర్ వేశారు. రాధా మాట్లాడుతున్నంత సేపు అభిమానులు ఈలలు, చప్పట్లతో ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేస్తే జగన్‌ అసెంబ్లీకి కూడా రాలేదన్నారు. కాపు రిజర్వేషన్లు తన పరిధి కాదంటూ జగన్‌ తప్పించుకున్నారు. ఈడబ్ల్యూసీ కోటాలో కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించామని చంద్రబాబు గుర్తు చేశారు.

ధనికరాష్ట్రం తెలంగాణ కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది. టైమ్స్ నౌ చానల్‌ స్టింగ్ ఆపరేషన్‌లో వైసీపీ అధికార ప్రతినిధే లోగుట్టు బయటపెట్టాడు. మోదీ, కేసీఆర్, జగన్‌ కలిసి ఏపీపై కుట్రలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారు.