నా వల్ల నన్ను కట్టుకున్న వాళ్లకు, బిడ్డలకు సుఖం లేదు.. పవన్

0
58
Pawan Kalyan
Pawan Kalyan

ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నామంటూ స్పష్టంగా చెప్పారు పవన్ కల్యాణ్. రాజమండ్రిలో గురువారం నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్స సభలో పవన్ ప్రసంగం ఉద్వేగపూరితంగా సాగింది. తాను ఇంటర్మీడియట్ తో చదువు ఆపేసినా పుస్తకాలు చదవడం మాత్రం ఆపలేదన్నారు.

మనిషికి అన్యాయం జరుగుతుంటే ఆ మనిషి ఎవరు, ఏ కులం, ఏ మతం? అంటూ వర్గీకరణ చేసి చూడలేదని చెప్పారు. జనసేనను స్థాపించినప్పుడు తానొక్కడినే అని, కానీ ఇప్పుడు ఓ సైన్యం తన వెంట ఉందని అన్నారు.

గత ఎన్నికల సమయంలో తాను కొందరికి పల్లకీలు మోశానంటూ పరోక్షంగా టీడీపీ, బీజేపీలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. 2014లో తాను పల్లకీలు మోసింది తన కోసం కాదని, ప్రజలను అభివృద్ధి అనే పల్లకీలో ఏమైనా కూర్చోబెడతారేమో అన్న ఆశతో మోశానని తెలిపారు. కానీ కొందరు తనను వాడుకుని ప్రజలను వంచించారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద డబ్బు లేదని, అయినా ప్రజలకు మేలు చేయాలన్న బలమైన కోరికతో రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.

“గాంధీ వద్ద ఏముందని రంగంలోకి దిగారు? భగత్ సింగ్ వద్ద ఏముందని ముందుకు ఉరికారు? కేవలం మానవత్వానికి ప్రతినిధిగా మాత్రమే వచ్చానని వెల్లడించారు. రాయలసీమలో బలం ఉందని చెప్పడానికి రియల్ లైఫ్‌లో తొడలు కొట్టి చెప్పాలా? సినిమాల్లో తొడలు కొడితే బాగుంటుంది కానీ రియల్ లైఫ్‌లో కాదు. రాయలసీమ అంటే బాంబుల సంస్కృతి అని చెబుతారే తప్ప ఏనాడైనా అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ తిరుగాడిన నేల అని ఎవరైనా చెప్పారా? వీరబ్రహ్మేంద్రస్వామికి జన్మనిచ్చిన నేల అది, పీర్ బాబా తిరిగిన నేల ఇదంటూ ఆవేశంగా వ్యాఖ్యానించారు.

తాను రాజకీయాల్లోకి వచ్చింది స్వప్రయోజనాల కోసం కాదని, ఏదో సంపాదించుకుందామన్న ఉద్దేశం లేనేలేదని పవన్ స్పష్టం చేశారు. సినిమాలు లేకపోయినా ఏ అభిమానిని అడిగినా పట్టెడన్నం పెడతారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.

తనకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు అర్థంకాలేదని, జగన్, చంద్రబాబు ఎందుకు విరోధులయ్యారో తెలియడంలేదని అన్నారు. తనను ఏమీ అనలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తానేమైనా వేలకోట్లు దోచానా? అంటూ ప్రశ్నించారు. తనకు జగన్ అన్నా, చంద్రబాబు అన్నా వ్యక్తిగత వైరం ఏమీలేదని స్పష్టం చేశారు.

తనకు ఎన్ని ఆస్తులు ఉన్నా సుఖం లేదని, తన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు కూడా తన వల్ల సుఖం లేదని అన్నారు. తన అన్నకు కూడా తన వల్ల సుఖం లేదని, తనను కట్టుకున్నవాళ్లకు, తన బిడ్డలకు సుఖం లేదని పవన్ వెల్లడించారు. ఈ సందర్భంగా పవన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు.

Pawan Kalyan
Pawan Kalyan