ఏపీ రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఎట్టకేలకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వచ్చే నెల 11వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈ మేరకు టీడీపీ విడుదల చేసిన జాబితాలో లోకేశ్ పేరు ఉంది.
నిజానికి ఈయన తొలుత భీమిలి నియోజకవర్గంలో పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ, తెలుగుదేశం పార్టీ మాత్రం మంగళగిరి టికెట్ కేటాయించింది. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని భావించిన నారా లోకేశ్ గురువారం వ్యూహాత్మకంగా ప్రచారం మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఎంతో చైతన్యం ఉన్న ఈ ప్రాంతంలో రాష్ట్ర రాజధాని రావడం అదృష్టమని లోకేశ్ అన్నారు. ఈ ప్రాంతంలో ఐటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, తన ప్రచారంలో కేంద్రంపై ఆరోపణలు చేశారు. ఏపీ నేతలపై కేంద్రం ఐటీ దాడులు చేయిస్తూ కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు