తన ఇంట్లోని బాత్రూమ్‌లో హత్యకు గురైన వైఎస్ఆర్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వివేకానందరెడ్డి హత్యకు గురైనట్టు శుక్రవారం ఆయన మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టంలో నివేదికలో తేలింది. ఇది రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ వ్యవహారంతో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే, వివేకా మృతదేహం రక్తపుమడుగులో పడి ఉండటమే కాకుండా, ఒంటిపై బలమైన కత్తిపోట్లు కనిపించడంతో హత్యకు గురయ్యారంటూ పోస్టుమార్టంకు ముందే అంచనావేశారు. పోస్టుమార్టం తర్వాత అది నిజమేనని రూఢీ అయింది.
ఈ నేపథ్యంలో, హంతకుడు ఎవరన్న దానిపై వివేకా కుటుంబ సభ్యులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. పాత నేరస్తుడు సుధాకర్ రెడ్డిపై వైఎస్ కుటుంబ సభ్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్ రెడ్డికి ఘనమైన నేరచరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది.
గతంలో వైఎస్.రాజారెడ్డి హత్యకేసులో కూడా సుధాకర్ రెడ్డి నేరస్తుడు అని సమాచారం. ఇప్పటివరకు కడప సెంట్రల్ జైలులో ఉన్న సుధాకర్ రెడ్డి మూణ్నెల్ల కిందటే సత్ప్రవర్తన కారణంగా విడుదలయ్యాడని, ఆయనే ఈ హత్యకు పాల్పడివుంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.