గత ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై గెలిచిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు ఎన్నికల ముందు కోలుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు తిరిగి కర్నూలు లోక్‌సభ సీటును కేటాయించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ససేమిరా అన్నారు. దీంతో ఆమె ఏం చేయాలో దిక్కుతోచక తిరిగి వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చెంతకు చేరేందుకు నిర్ణయించుకున్నారు.
ఇటీవల కర్నూలు జిల్లాలో అనేక రాజకీయ మార్పులు సంభవించాయి. ఇందులోభాగంగా, దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలోకి చేరింది. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. పైగా, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కర్నూలు లోక్‌సభ సీటును కేటాయించేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
దీంతో సిట్టింగ్ ఎంపీ అయిన రేణుకకు ఆదోని అసెంబ్లీ స్థానాన్ని ఆఫర్ చేసిందని సమాచారం. అయితే, అసెంబ్లీకి వెళ్లేందుకు రేణుక ససేమిరా అన్నట్టు చెబుతున్నారు. రేణుకను వదులుకోవడానికి ఇష్టంగా లేని టీడీపీ అధిష్ఠానం రాజ్యసభకు పంపుతామన్న హామీ ఇచ్చినా ఆమె మాత్రం పార్టీ వీడేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
దీంతో బుట్టా రేణుక పరిస్థితి అటూఇటూ కాకుండా పోయింది. తాను మోసపపోయానని గ్రహించిన ఆమె… ఇపుడు తిరిగి సొంతగూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయంపై శనివారం ఇడుపులపాయలో ఆమె వైసీపీ చీఫ్ జగన్‌ను కలుసుకోబోతున్నట్టు కూడా సమాచారం.