గుండెపోటుతో చనిపోతే తలలో రక్తం వస్తుందా? చంద్రబాబు

Chandrababu Naidu: Jagan attempts to draw political mileage from Vivekananda Reddy murder

0
43
ys vivekananda reddy
ys vivekananda reddy

మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగిందన్నదానిపై నిగ్గు తేల్చాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

వైఎస్ వివేకా మృతిపై ఆయన స్పందిస్తూ, వైఎస్ వివేకానందరెడ్డి మొదట గుండెపోటుతో మరణించారని చెప్పారు. గుండెపోటు వస్తే తలలో రక్తం వస్తుందా?. శవాన్ని తీసుకొచ్చి బెడ్‌రూమ్‌లో పెట్టి కట్లు కట్టారు. బెడ్‌రూమ్‌లో రక్తాన్ని కడిగేసి బెడ్‌షీట్లు మార్చారు. పోస్టుమార్టం రిపోర్ట్‌ వచ్చాక మాట మార్చారు.

సాక్ష్యాలను తారుమారు చేశారు. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలి అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఉందనే సీబీఐ విచారణ అంటున్నారని చెప్పారు. వాళ్లకు ఢిల్లీలో ఒక కాపలాదారు ఉన్నారని అన్నారు. వివేకాను ఎవరు చంపారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. హత్యను గుండెపోటుగా ఎవరు చిత్రీకరించారో తెలియాలని సీఎం కోరారు.

కాగా, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వాకాపా నేత వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. ఎస్ వివేకానందరెడ్డిది సహజమరణం కాదు, అనుమానాస్పద మృతి అని చెప్పామే తప్ప, ఆయన గుండెపోటుతో మరణించాడని తాము ఎక్కడా చెప్పలేదన్నారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వివేక హత్యపై విచారణ చేయకుండా ఏపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. వివేక మృతి వార్తను ఆయన బావమరిది శివప్రకాష్ రెడ్డి తనకు చెప్పారని, అప్పటికే కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్న విషయాన్ని ప్రస్తావించారు.

వివేక మృతి వార్త గురించి పోలీసులకు సమాచారమిచ్చింది తానేనని, ఆయన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని, శవపంచనామా చేయాలని పోలీసులను కోరిన విషయాలను గుర్తుచేశారు. తమపై పోలీసులు ఇలాంటి రాజకీయాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

ఎన్నోసార్లు సిట్ వేశారు కానీ, బాధితులకు న్యాయం జరిగిన సందర్భాలు లేవని అన్నారు. ఈ హత్య కేసులో సిట్ ద్వారా న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు లేదని, సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వివేకా మృతదేహం వద్ద తమకు ఎలాంటి లేఖ దొరకలేదని, అసలు, ఈ లేఖ ఎలా వచ్చిందో పోలీసులే తేల్చాలని అన్నారు.