కామంతో కళ్లుమూసుకునిపోయిన 60 యేళ్ళ వృద్ధుడు ఒకడు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే వికృత చర్యకు పాల్పడ్డాడు. వరుసకు మనుమరాలు అయ్యే 16 యేళ్ళ మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలో వెలుగు చూసింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోవెలకుంట్ల మండలం ఎం.ఉప్పలూరు గ్రామానికి చెందిన జి.పుల్లయ్య(60) అనే వృద్ధుడు ఉంటున్నాడు. ఈయన ఇంటిపక్కనే 16 యేళ్ళ వయసున్న మతిస్థిమితం లేని బాలిక ఉంది. ఈమె పుల్లయ్యకు వరుసకు మనుమరాలు అవుతుంది. ఈ బాలికపై కన్నేసిన వృద్ధ కామాంధుడు.. ఆమెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. అలాగ గత యేడాది కాలంగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు.
ఈ క్రమంలో ఇటీవల ఆ యువతి అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు… ఆర్నెల్ల గర్భవతి అని చెప్పారు. దీంతో షాక్‌కు గురైన వారు.. ఆ యువతిని నిలదీయడంతో అసలు విషయం చెప్పింది.
ఆ తర్వాత పుల్లయ్యను చితకబాదడంతో నిజం అంగీకరించాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశం మేరకు రిమాండ్‌కు తరలించారు. యువతిని వైద్య పరీక్షల కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.