మాజీ మంత్రి, వైకాపా నేత, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సోదరుడు వైఎస్ ప్రతాప్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యపై ఎలాంటి అనుమానాల్లేవని, సీబీఐ విచారణ కోరడం రాజకీయంగా చేసిన వ్యాఖ్య కావచ్చని ఆయన జగన్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
రాజకీయంగా చాలా మంది చాలా మాట్లాడుతారని, రాజకీయాలతో తమకు సంబంధం లేదని వైఎస్ ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యానించడం కొసమెరుపు. మైనింగ్ ఆర్దిక లావాదేవీల విషయంలో తన ఇంటి ముందు వివేకా ధర్నా చేసిన మాట వాస్తవమేనని, మైనింగ్ లావాదేవీలతో హత్యకు సంబంధం లేదని వైఎస్ ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
మరోవైపు, వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం సాగుతోంది. వివేకా సోదరులు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, వివేకా బావమరిది శివప్రకాష్ రెడ్డి, జగన్ అనుచరుడు శంకర్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా వీరు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైనారు.
ఈ సందర్భంగా వారిపై దర్యాప్తు అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. వివేకా గుండెపోటుతో మరణించారని ఎందుకు చెప్పారు? పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మీరే ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? బాత్‌రూంలో పడి ఉన్న వివేకాను ఎందుకు బెడ్ రూంలోకి తీసుకువచ్చారు? రక్తపు మరకలను ఎందుకు తుడిచారు? బలమైన గాయాల వివేకా శరీరంపై ఉంటే గుండెపోటుతో మృతి చెందాడని ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఇలాంటి ప్రశ్నలను సిట్ బృందం వివేకా బంధువులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.