ఊపిరి తీసుకుని వదిలే గాలి వేడిగా ఉంటుందేం..?

0
43

మనం తీసుకున్న ఆహారం జీర్ణక్రియకు లోనవగానే పిండి పదార్థాల నుంచి గ్లూకోజ్‌ అనే శక్తిమంతమైన అణువులు రక్తంలో కలుస్తాయి. ఒక్కోసారి చాలా కాలం పాటు ఆహారం తినకుండా ఉన్న‌ట్లైతే శరీరంలో ఉన్న కొవ్వు నిల్వల నుంచి కూడా గ్లూకోజ్‌ ఏర్పడుతుంది. శరీరంలో ఉన్న గ్లూకోజ్‌ ప్రతి జీవన కార్యకలాపాలకు కావలసిన శక్తికి ఆధారమని మనం గుర్తించాలి. అయితే ఆ గ్లూకోజ్‌ నుంచి శక్తిని రాబట్టాలంటే దాన్ని రసాయనికంగా ఆక్సీకరణం చెందించాలి. అందుకు మనం గాలిలో ఉన్న ఆక్సిజన్‌ను శ్వాస క్రియలో ఉచ్ఛ్వాసం ద్వారా రక్తంలోకి పంపుతాం. ఆక్సిజన్‌ సమక్షంలో ఆక్సీకరణం చెందిన గ్లూకోజ్‌ కార్బన్ డై ఆక్సైడ్‌, నీటి ఆవిరిగా విఘటనం చెందే క్రమంలో ఉష్ణశక్తి కూడా పుడుతుంది. ఇందులో చాలా భాగం ADP అనే అణువు, ATP అనే శక్తియుత అణువుగా మారడానికి ఉపయోగపడగా కొంత భాగం రక్తంలోనే కలిసిపోతుంది.

రక్తపు ఉష్ణోగ్రత, దేహ ఉష్ణోగ్రత క్రమ బద్ధీకరించబడతాయి. రక్తంలో కలిసిన కార్బన్ డై ఆక్సైడ్‌, నీటి ఆవిరి దేహ ఉష్ణోగ్రత (సుమారు 37 డిగ్రీల సెల్సియస్‌) వద్దే ఉంటాయి. అవి నిశ్వాసంలో బయట పడేప్పుడు దేహ ఉష్ణోగ్రత వద్దే బయటికి వస్తాయి. సాధారణంగా సంవత్సర కాలంలో బయట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువే ఉంటుంది. బయట 37 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువ ఉష్ణోగ్రత నుంచి గాలి లోనికి వెళ్తున్నా నిశ్వాసంలో విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్‌, నీటి ఆవిరి కనీసం 37 డిగ్రీల సెల్సియస్‌ దగ్గర ఉండటం వల్ల నిశ్వాసంలో వేడి గాలి బయటికి వస్తున్నట్లు ఉంటుంది.