వివేకాను హత్య చేసింది.. ఎవరు..? కోట్ల రూపాయల సెటిల్మెంటే కారణమా?

0
40
vivekananda-reddy

vivekananda-reddyతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ జగన్ బాబాయ్, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. వివేకా హత్య వెనుక రూ.125 కోట్ల సెటిల్మెంట్ వ్యవహారమే కారణమని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ హత్య కేసులో దర్యాఫ్తును ముమ్మరం చేసిన అధికారులు, మొత్తం వ్యవహారమంతా ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిల చుట్టూనే ఉందని, వారు నోరువిప్పితే మొత్తం బయటకు వస్తుందని చెప్తున్నారు.

హత్యకు రెండు వారాల ముందే రెక్కీ జరిగిందని, బెంగళూరులోని ఓ భూ వివాదంలో వివేకా, గంగిరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయని అనుమానిస్తున్నారు. ఈ డీల్ కు సంబంధించి రూ. 1.50 కోట్ల లావాదేవీలపై సిట్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. డీల్‌లో తాము నష్టపోకూడదన్న ఉద్దేశంతో గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి చేతులు కలిపారని, వివేకా హత్యకు నాలుగు రోజుల ముందు పెంపుడు కుక్కను హత్య చేశారని సిట్ అధికారులు అంటున్నారు. హత్య తరువాత గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, గత నాలుగు రోజులుగా రహస్య ప్రాంతంలో విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

ఇంకా ఈ కేసులో నిందితుడంటూ రోజుకొకరిపై అనుమానాలు మళ్లుతున్నాయి. తాజాగా, వివేకా సన్నిహితుడు పరమేశ్వర్ రెడ్డిపై సందేహాలు ముసురుకున్నాయి. అయితే, తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరమేశ్వర్ రెడ్డి వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఆ రోజు వివేకా ఇంటి తలుపు తీసినవాళ్లే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వివేకా హత్య ఇంట్లో వాళ్ల పనే అయ్యుంటుందని, లేకపోతే, ఇంటి తలుపు ఎవరు తీస్తారని ప్రశ్నించారు. ఇంటి దొంగలే వివేకా ప్రాణాలు బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా చీఫ్ సీఎం అయితే వివేకా బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేవాడని, కానీ ఆయన ఎదుగుదల చూడలేనివాళ్లే ఆయన్ను హత్యచేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు.