ధోనీ బ్యాటు పట్టుకుని దిగితే.. ఇంకేముంది.. రైనా ఫామ్‌లో వున్నాడు..

0
71

ఐపీఎల్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చెన్నై వేదికగా పొట్టి క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ టైటిల్ ఫేవరేట్స్‌గా భావిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగనుండగా, ధోనీ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు వస్తున్న వేళ, తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సీఎస్కే ప్రాక్టీస్ మ్యాచ్‌ని తిలకించేందుకు అభిమానులను అనుమతించడంతో స్టేడియంలోకి దాదాపు 40 వేల మంది ఫ్యాన్స్ వచ్చారు. ధోనీ బ్యాట్ తీసుకుని మైదానంలోకి వస్తుంటే కరతాళధ్వనులతో “ధోనీ… ధోనీ” అంటూ వేసిన కేకలతో స్టేడియం దద్దరిల్లింది. ఈ సందర్భంగా తీసిన వీడియో వైరల్ అవుతోంది.

మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభంకానుండగా.. గత ఏడాడి విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢీకొట్టబోతోంది.

ఇక ఐపీఎల్ 2019 సీజన్ ముంగిట టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా మంచి ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. సుదీర్ఘకాలంగా చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఆడుతున్న రైనా.. అసాధారణంగా 9 ఐపీఎల్ సీజన్లలో ఏకంగా 400పైచిలుకు స్కోరు సాధించాడు.

2018 ఐపీఎల్ సీజన్‌లోనూ ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ 445 పరుగులు చేయగా.. ఇందులో నాలుగు అర్ధశతకాలు కూడా ఉండటం విశేషం. ఈ ఏడాది కూడా ఐపీఎల్‌లో అదేజోరుని కొనసాగించాలని రైనా ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక ధోనీ ఐదో ఆటగాడిగా చెన్నై తరపున బరిలోకి దిగుతాడని తెలుస్తోంది.