పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన వేల కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త నీరవ్ మోదీని లండన్‌లో అరెస్ట్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేసి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని ఎట్టకేలకు లండన్‌లో అరెస్ట్ చేశారు.
అధికారుల సమాచారం ప్రకారం సెంట్రల్ లండన్‍లోని హోల్ బార్న్ మెట్రో స్టేషన్‌లో మోదీని అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో యూకే పోలీసులు ఆయనను ప్రవేశపెట్టారు. మరోవైపు నీరవ్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా దాన్ని కోర్టు తిరస్కరించింది. ఈ నెల 29 వరకు పోలీసు కస్టడీ విధించింది.
నీరవ్ మోదీని అప్పగించాలంటూ ఈడీ చేసిన విన్నపం మేరకు బ్రిటన్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. అయితే, నీరవ్ మోదీని భారత్‌కు అప్పగిస్తారా, లేదా అనే విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది. లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాను ఇంతవరకు భారత్‌కు బ్రిటన్ అప్పగించని సంగతి తెలిసిందే.