సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న సినీ హీరోయిన్లలో దివ్యవాణి ఒకరు. ఆమె రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పాటు.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బాబు విజయంపై మాట్లాడారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేశ్ భారీ మెజార్టీతో గెలుపొందుతాడని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలో లోకేశ్ పోటీ చేస్తున్న విషయమై ఆమెను ప్రశ్నించగా, సీఎం చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని, ఏది మంచి, ఏది చెడు అన్న విషయం ఆయనకు తెలుసని అన్నారు.
చంద్రబాబు చెప్పారంటే.. ‘మైనస్’ ని కూడా ‘ప్లస్’ గా మార్చుకోవడానికి తాము కృషి చేస్తామని చెప్పారు. ప్రతిపక్ష నాయకుల్లాగా లోకేశ్ భూ కబ్జాలు చేయలేదని, ఆయనేమీ నేరస్తుడు కాదని, ఆయన్ని విమర్శించే అర్హత ఎవరికీ లేదని అన్నారు.
ఎన్టీఆర్కు మనవడిగా, బాలకృష్ణకు అల్లుడిగా, సీఎం చంద్రబాబునాయుడి కొడుకుగా లోకేశ్ కూడా ఎన్నో భూ కబ్జాలు చేయొచ్చు, కావాలంటే, విదేశాల్లో స్థిరపడొచ్చు కానీ, ప్రజలకు సేవ చేయాలన్నది ఆయన తాపత్రయం అని చెప్పారు.