ప్లీజ్.. మా నాన్న హత్య కేసు విచారణను సీబీఐకు అప్పగించండి : వివేకా కుమార్తె సునీత

0
49
vivekananda-reddy

తన తండ్రి, వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గాబాకు ఆయన కుమార్తె సునీతారెడ్డి విజ్ఞప్తిచేశారు.

ఆమె శుక్రవారం తన భర్త నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డితో కలిసి ఢిల్లీలో వారిని కలిశారు. తొలుత సునీల్‌ అరోరాను కలవగా… కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలువాలని ఆయన సూచించారు. దాంతో ఆమె హోం శాఖ కార్యదర్శిని కలిశారు. ఆయన్ను కలిసి ఆమె ఓ వినతి పత్రం సమర్పించారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, సిట్‌ స్థానంలో ఎన్‌ఐఏ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరారు. దీనిపై తాము హైకోర్టులో పిటిషన్‌ వేసినట్లు తెలిపారు. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. హత్య కేసులో తమవారిని కూడా ఇరికిస్తారని భయంగా ఉందని సునీతారెడ్డి అన్నారు.

ఇదిలావుంటే, వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసులో దిద్దెకుంట శేఖర్‌రెడ్డి అనుచరులు నలుగురిని పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దిద్దెకుంట శేఖర్‌రెడ్డిని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని కడపలో విచారిస్తున్నారు.

గతంలో దిద్దెకుంట శేఖర్‌రెడ్డి తన అనుచరులతో కలసి రంగేశ్వర్‌రెడ్డిని హత్య చేశారు. ఈ హత్యకు సబంధించిన నలుగురు అనుచరులను శుక్రవారం అరెస్ట్‌ చేసి కడపకు తరలించారు. వివేకా హత్యకేసులో ఇప్పటికే దాదాపు 48 మందిని విచారించినట్లు సమాచారం.