ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఆసక్తికర పోటీ నెలకొంది. ఎందుకంటే పలు స్థానాల్లో వైరిపక్షాల తరపున కుటుంబ సభ్యులే పోటీపడుతున్నారు. తాజాగా అరకు లోక్‌సభ స్థానంలో కన్నతండ్రిపై కూతురు పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది.
ఈ స్థాన నుంచి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండగా, ఆయన కుమార్తె శృతిదేవి కాంగ్రెస్ పార్టీ తరపు తన తండ్రిపైనే పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన కిశోర్ చంద్రదేవ్ ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయనకు అరకు లోక్‌సభ సీటును కేటాయించారు.
మరోవైపు, ఆయన కుమార్తె శృతీదేవి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. తన సేవలను గుర్తించి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని శృతి అంటున్నారు. తన తండ్రితో పోటీపడటంపై స్పందించని ఆమె.. ఎన్నికల్లో తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేయడం విశేషం.
మరోవైపు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు కుమార్తె సైతం ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. టీడీపీ తరఫున విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి అశోక్‌గజపతి రాజు బరిలోకి దిగుతుండగా, ఆయన కుమార్తె ఇక్కడి నుంచే అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు.