దాంతో పనిలేదు.. పాత్ర బాగుందా లేదా అన్నదే ముఖ్యం: పరిణీతి చోప్రా

0
43

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్, హీరోయిన్ ప‌రిణీతి చోప్రా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అనురాగ్ సింగ్ తెర‌కెక్కించిన చిత్రం “కేస‌రి”. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. ముఖ్యంగా, అక్ష‌య్ కుమార్ వ‌న్ మ్యాన్ షోకి ప్రేక్ష‌కులు నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. ఫలితంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

అయితే, ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన పరిణీతి చోప్రా ఓ పాట‌కి మాత్ర‌మే ప‌రిమితం కాగా, ఈ చిత్రంలో ఆమెకు ఒక్క డైలాగ్ కూడా లేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఈ చిత్రంలో నటించేందుకు ఎలా అంగీకరించావు అంటూ ప్రశ్నిస్తున్నారు.

వీటికి పరిణీతి చోప్రా ట్విట్టర్ వేదికగా సమాధానమిచ్చింది. “నాకు మెసేజ్ చేసిన వారంద‌రికి ధ‌న్య‌వాదాలు. మీ ప్రేమ‌కి నేను కృత‌జ్ఞురాలిని. ‘కేస‌రి’ చిత్రంలో న‌టించాల‌ని మాత్ర‌మే నేను అనుకున్నాను త‌ప్ప నా స్క్రీన్ టైం ఇంత అంత అని ఏం ఆలోచించ‌లేదు. ఈ చిత్రం నాకు చాలా స్పెష‌ల్. ఈ అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి కృత‌జ్ఞ‌త‌లు’ అని ప‌రిణీతి చోప్రా తన ట్వీట్‌లో పేర్కొంది.

కాగా, ‘కేసరి’ చిత్రం 1897 సెప్టెంబ‌ర్ 12 జ‌రిగిన స‌ర‌గ‌ర్హి అనే మ‌హాసంగ్రామం నేప‌థ్యంలో తెర‌కెక్కింది. హవల్దార్‌ ఇషార్‌ సింగ్ అనే సిక్కు పాత్ర‌లో అక్ష‌య్ న‌టించారు. బ్రిటీష్ పాల‌నలో మ‌న‌దేశం ఉండ‌గా, ఆఫ్ఘ‌నిస్తాన్ నుండి సుమారు 10 వేల మంది సైనికులు మ‌న‌పై దండెత్తి వ‌చ్చారు. వారిని భార‌త సైన్యంలోని 21 మంది సిక్కు సైనికులు నిలువ‌రించారు. శ‌త్రువుల‌ని ఏరిపారేస్తూ వీర‌మ‌ర‌ణం పొందిన వారి త్యాగాల‌ని అందరికి తెలిసేలా చేయాల‌ని అక్ష‌య్ కేస‌రి సినిమా చేశాడు.