వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారి ఫైర్ అయ్యారు. దీదీ పాలనను వన్ మ్యాన్ షోగా అభివర్ణించారు. తన ఇష్టానుసారం రాష్ట్రాన్ని ఆమె పరిపాలిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
మమత ఎవరినీ సంప్రదించరని, ఎవరి సలహాలను కూడా తీసుకోరని.. తనకు నచ్చిందే ఆమె చేస్తారని ఎద్దేవాచేశారు. బెంగాల్‌లో ఏక వ్యక్తి పాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. మమత తన పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. బెంగాల్‌లో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా, శనివారం మాల్దా జిల్లా చంఛల్‌లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో రాహుల్ తొలిసారి మమతపై విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, మమత పాలనను పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రధాని మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పనితీరు ఒకేలా ఉంటుందని విమర్శించారు. వారిద్దరూ ఎవరినీ సంప్రదించకుండానే తమ ప్రభుత్వాలు నడుపుతున్నారు. ప్రజలను పూర్తిగా విస్మరించారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.