భారతీయ సంప్రదాయంలో పసుపు హిందువులకు పరమ పవిత్రమైనది. పూజల్లో ముందుగా పసుపుతో చేసిన విఘ్నేశ్వరుడిని చేసి కొలుస్తారు. పసుపు కొట్టడంతోనే పెళ్లిపనులు మెుదలువుతాయి. పెళ్లికార్డుకి పసుపు పూశాకే అది శుభలేఖ. ఒకప్పుడు పసుపుపారాణే మెహందీ. పెళ్లిలోని తాళి పసుపుతాడే. బంగారు సూత్రాలు లేకున్నాపసుపుకొమ్ము ఉంటే చాలు. పెళ్లయిపోతుంది. అందుకే పసుపు మనకు ఎంతో శుభకరం.
* పసుపులో అందంతోబాటు ఆరోగ్యమూ దాగుంది. మెుటిమలకు మంచి మందు. పాదాలకు రాస్తే ఇన్ఫెక్షన్లని దరికి రానివ్వదు. గాయాలకు పసుపు రాస్తే త్వరగా మానిపోతాయి.
* మన ఆహారంలోనూ పసుపు వాడకం ఎక్కువే. ఏ కూర చేయాలన్న అందులో చిటికెడు పసుపు వేయాల్సిందే. ఇకపోతే జలుబు చేసినా, జ్వరం వచ్చినా గోరు వెచ్చని పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగితే త్వరగా తగ్గుతుంది.
* పసుపులోని కుర్‌క్యుమిన్ అనే రసాయనం గురించి కొత్త సంగతులెన్నో ఉన్నాయనీ నిపుణులు కనుగొన్నారు. కుర్‌క్యుమిన్ ఇవ్వడం వల్ల ఆల్లీమర్స్ రోగుల్లో జ్ఞాపకశక్తి పెరిగిందట.
* బైపాస్ సర్జరీ తర్వాత నాలుగైదు రోజులపాటు పసుపు నీరు తాగడం వల్ల ఇతరత్రా సమస్యలేవీ తలెత్తలేదట. కేన్సర్ కణాల పెరుగుదలనూ ఇది అడ్డుకుంటుంది. హృద్రోగాలనీ నియంత్రిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
* ఇంకా కీళ్లనొప్పులు, పొట్టనొప్పి, డయేరియా, ఆకలి లేకపోవడం, తలనొప్పి, కామెర్లు, బ్రాంకైటిస్, చర్మ సంబంధ సమస్యలు, జలుబు, జ్వరాలూ, ఇలా ఒకటేమిటి సకల వ్యాధులకూ కుర్‌క్యుమిన్ మందులూ పని చేస్తాయని మన నిపుణులు చెబుతున్నారు.