ఐపీఎల్ 2019 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ బోణి అందుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చేపాక్ వేదికగా శనివారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, మొయిన్ అలీ వికెట్లను వరుస ఓవర్లలో పడగొట్టిన హర్భజన్ సింగ్‌కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్, టీమిండియా సారథి కోపం గురించి ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రిషబ్ పంత్ వ్యాఖ్యానించాడు. కోహ్లీకి కోపం వస్తే తాను భయంతో వణికిపోతానని టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ అంటున్నాడు. టెస్టులు, వన్డేలు, టీ-20ల్లో రాణిస్తున్న రిషబ్, భవిష్యత్తులో ధోని స్థానాన్ని భర్తీ చేస్తాడని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే.
కోహ్లీ కోపం గురించి పంత్, ఇటీవల మాట్లాడుతూ, మామూలుగానైతే తాను ఎవరికీ భయపడబోనని, అయితే, విరాట్ భయ్యాకు కోపమొస్తే మాత్రం భయపడతానని చెప్పాడు. తప్పు చేయని వారిపై కోహ్లీ ఎన్నడూ కోపగించుకోడని, ఎవరిపైనైనా కోహ్లీకి కోపం వచ్చిందంటే తప్పు చేసినట్టేనని తెలిపాడు.
మనపై ఎవరికైనా కోపం వచ్చిందంటే, పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చిందని గుర్తించాలని రిషబ్ చెప్పుకొచ్చాడు. రిషబ్ వీడియోను ఢిల్లీ కాపిటల్స్ ఫ్రాంచైజీ, తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోని శైలీలో స్టంపింగ్ చేయబోయి మిస్ అయిన పంత్‌పై కోహ్లీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.