టాలీవుడ్‌లో వెంకీ.. వెంకీమామ అయ్యారు. సీనియర్ హీరో వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత వివాహం ఆదివారం అట్టహాసంగా జరిగింది. రాజస్థాన్, జైపూర్‌లోని ఓ స్టార్ హోటల్ ఈ సెలబ్రిటీ మ్యారేజికి వేదికగా నిలిచింది.
ఈ పెళ్లికి మూడ్రోజుల ముందు నుంచే జైపూర్ తారాతోరణంతో కళకళలాడింది. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, బీనాకాక్ వంటి ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. అలాగే టాలీవుడ్ నుంచి రానా దగ్గుబాటి, అక్కినేని నాగచైతన్య-సమంత, రామ్ చరణ్-ఉపాసన తదితరులు హాజరయ్యారు.
శుక్రవారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించగా, శనివారం సంగీత్ కార్యక్రమంలో ఆడిపాడారు. ఇక ఆదివారం తెల్లవారుజామున వచ్చిన ముహూర్తంలో అశ్రిత, హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు.