ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డేనని సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు జోస్యం చెప్పారు. ఆయన మంగళవారం వైకాపాలో చేరారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జగన్ తప్పకుండా సీఎం అవుతారని తెలిపారు. ఆయన సీఎం అయితే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. చంద్రబాబు పాలనలో ఏపీ అధోగతి పాలైందని విమర్శించారు.
వాస్తవానికి చంద్రబాబును అగౌరవపర్చాలని తనకు లేదన్నారు. చంద్రబాబును ఫీజు రీయింబర్స్ మెంట్ గురించి ఎన్నోసార్లు అడిగానని.. మూడు మాసాలకు ఒకసారి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామన్నారని గుర్తుచేశారు. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు నుంచి సమాధానం లేదన్నారు.
తమ విద్యా సంస్థలకు రూ.19 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ రావాలన్నారు. చంద్రబాబు చేసిన వాగ్ధానాలనే నెరవేర్చమని అడుగుతున్నానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి బకాయిలు లేవని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలు ఏపీ ప్రజలపై దాడులు చేయలేదని తేల్చి చెప్పారు. అలాగే, తాను రౌడీయిజం చేసి ఆస్తులు సంపాదించలేదన్నారు.
అలాగే, వైసీపీలో చేరడానికి తాను ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. 15 సంవత్సరాల క్రితమే పదవులను అనుభవించానని… ఇప్పుడు పదవులపై తనకు మమకారం లేదని తెలిపారు. గతంలో ఒకసారి బీజేపీ సీనియర్ నేత అద్వానీ కారులోకి వెంకయ్యనాయుడు తనను ఎక్కించారని… ఆయనతో కలసి చెన్నై వరకు తాను ప్రయాణించానని చెప్పారు.
నిజాయతీపరుడు, ముక్కుసూటి మనిషని మీ గురించి తాను విన్నానని అద్వానీ చెప్పారని అన్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్లో జరిగిన బీజేపీ సభలో వాజ్ పేయి తనను కౌగిలించుకున్నారని గుర్తుచేశారు. సమాజంలో ఏదైనా తప్పుడు పని చేసినప్పుడే తల దించుకోవాలని, ఆత్మపరిశీలన చేసుకొని చనిపోవాలని మోహన్ బాబు అన్నారు. చంద్రబాబుకు తాను భయపడనని చెప్పారు.
ఇకపోతే, ‘చంద్రబాబుకు నవ రంధ్రాలు’ అనే పదాన్ని తాను ఎప్పుడూ ఉపయోగించలేదని అన్నారు. తనకు తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు ఒకటేనని చెప్పారు. హైదరాబాదులోని ఉప్పల్‌లో తనకు స్కూల్ ఉందని, ఇప్పుడు హాస్టల్ కూడా కడుతున్నామని చెప్పారు.
ఎన్టీఆర్ మరణించిన తర్వాత తాను ఏ పార్టీలో చేరలేదన్నారు. ఎంపీనో, ఎమ్మెల్యేనో కావాలనుకుంటే మూడేళ్ల క్రితమే జగన్‌కు మద్దతిచ్చేవాడినని చెప్పారు. ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నది తమ శ్రీ విద్యానికేతనే మోహన్ బాబు చెప్పుకొచ్చారు.