ఐపీఎల్‌లో భాగంగా గెలిచే మ్యాచ్‌ను రాజస్తాన్ రాయల్స్ చేజార్చుకుంది. బట్లర్ ధీటుగా రాణించినా.. అతని ఇన్నింగ్స్ వృధా అయ్యింది. క్రిస్ గేల్ చెలరేగి ఆడటంతో పంజాబ్ 14 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది.
పంజాబ్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ విజయ లక్ష్యం 185 పరుగులు. బట్లర్ మెరుపు బ్యాటింగ్‌తో ఒక దశలో స్కోరు 108/1… సాఫీగా సాగిపోతున్న ఇన్నింగ్స్‌లో రాయల్స్‌కు కుదుపు… వివాదాస్పద రీతిలో బట్లర్‌ను అశ్విన్ మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడంతో జట్టు లయ దెబ్బ తింది.
ఆ తర్వాత రహానే బృందం కోలుకోలేకపోయింది. 21 బంతుల్లో 37 పరుగులు చేయాల్సిన స్థితిలో టీమ్ కుప్పకూలింది. 16 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి రాయల్స్ ఓటమి పాలైంది. అంతకుముందు క్రిస్ గేల్ మెరుపు బ్యాటింగ్‌కు తోడు సర్ఫరాజ్ కూడా చెలరేగడంతో పంజాబ్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది.
ఫలితంగా సొంతగడ్డపై తొలి మ్యాచ్‌ను రాజస్తాన్ రాయల్స్ ఓటమితో ప్రారంభించింది. సోమవారం ఇక్కడ జరిగిన పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 14 పరుగుల తేడాతో రాజస్తాన్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
క్రిస్ గేల్ (47 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా… సర్ఫరాజ్ ఖాన్ (29 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 170 పరుగులే చేయగలిగింది. జోస్ బట్లర్ (43 బంతుల్లో 69; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడగా… సంజు శామ్సన్ (25 బంతుల్లో 30; 1 సిక్స్) మినహా మిగతావారంతా విఫలమయ్యారు.