ఏపీ ఆక్టోపస్ గా, గతంలో ఎన్నో సర్వేల్లో రాబోయే ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేశారన్న పేరున్న లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వే ఫలితాలంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ హల్ చల్ చేస్తోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో, నిన్న సాయంత్రం నుంచి ఈ సర్వే తెగ చక్కర్లు కొడుతోంది. ఉత్తరాంధ్ర నుంచి అన్ని జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయాన్ని అంకెలతో సహా ఇందులో తెలిపారు. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుంది. రాయలసీమతో పాటు ప్రకాశం, ఉత్తరాంధ్రల్లో ఫ్యాన్ గాలి బాగా వీస్తోంది. మిగతా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో కనిపిస్తోంది.
అయితే ఏపీలో జరిగే ఎన్నికలకు సంబంధించి సర్వే నిర్వహించామని, పోలింగ్ అయిపోయిన తరువాత మాత్రమే ఆ ఫలితాలను వెల్లడిస్తానని లగడపాటి ఇటీవల వెల్లడించారు. కాగా, ఈ సర్వే ఫలితాలను అందుకున్న వారు దాని గురించిన నిజానిజాలను తెలుసుకోకుండానే మరో గ్రూప్ లోకి తోసేస్తుండటంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది లగడపాటి పేరిట ప్రచారం అవుతుండటంతో పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇక ఈ సర్వే తన సర్వేయేనా? అన్న విషయమై ఆయన స్పందించాల్సివుంది.