దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిర్భయ లాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ.. మహిళల భద్రత కోసం కఠినమైన శిక్షలు అమలు కావట్లేదు. ఇందుకోసం కేంద్రం చట్ట సవరణలకు పూనుకోవట్లేదు. తాజాగా ఢిల్లీలో ఓ తెలుగమ్మాయికి అన్యాయం జరిగింది.
ఢిల్లీలో జరిగిన ఓ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే గురుటేక్ నగర్‌లో నిస్సహాయంగా ఉన్న 16 ఏళ్ల బాలికను గుర్తించిన పోలీసులు ఏపీ భవన్ అధికారులకు సమాచారం అందించారు.
బాలిక మానసిక పరిస్థితి సరిగ్గాలేదని.. ఆమెపై అత్యాచారం పాల్పడి వుండవచ్చునని.. ఇటీవలే అబార్షన్ చేయించినట్టుగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆమె తెలుగు తప్ప మరో భాష మాట్లాడలేకపోతోందని పేర్కొన్న పోలీసులు ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు తెలుగు తెలిసిన వ్యక్తిని పంపాల్సిందిగా ఏపీ భవన్ అధికారులను కోరారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు నేడు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు.