తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయడం తప్పే.. తప్పున్నర కూడా అంటూ ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ఈ గడ్డపైనే పుట్టాడా అంటూ బాబు ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో పుట్టిన ఎవరైనా కేసీఆర్‌కు మద్దతిస్తే ఖబడ్దార్ అంటూ పరోక్షంగా జగన్‌కు హెచ్చరికలు జారీచేశారు. అలాంటివాళ్లు రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారని చంద్రబాబు స్పష్టం చేశారు.
కడప రోడ్ షోలో జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ నీకు సిగ్గేమైనా ఉంటే, పుట్టిన స్థలంపై అభిమానం ఏమైనా ఉంటే ఎలా కేసీఆర్‌ను సపోర్ట్ చేస్తావ్? అంటూ ప్రశ్నించారు.
రాయలసీమకు నీళ్లొచ్చే పథకాలకు అడ్డుతగులుతున్న కేసీఆర్‌కు మద్దతిస్తావా? రాయలసీమ రాళ్లసీమగా మారిపోవాలా? అంటూ చంద్రబాబు అడిగారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రాన్ని ఎదిరించి తామే ప్రారంభోత్సవం జరిపామన్నారు.
కానీ జగన్‌కు భయం.. కేసీఆర్‌ను చూస్తే ఉచ్చలు పోసుకుంటాడని.. మీరు జగన్ మాటలు వింటే బాంచన్ నీ కాల్మొక్తా అంటూ కేసీఆర్ కాళ్ల వద్ద కాపలా కాయడానికి సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతుందని తీవ్రపదజాలంతో ఏకిపారేశారు. జగన్ కేసుల భయంతో మోదీ సంకలో కూర్చున్నారు. రాష్ట్ర గౌరవాన్ని కేసీఆర్‌కు తాకట్టుపెట్టారని జగన్‌పై బాబు నిప్పులు చెరిగారు.