జైల్లో ఉండొచ్చిన మీరు మహాత్మాగాంధీయా? : జగన్‌పై పవన్ ఫైర్

0
55

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మహాసంగ్రామాన్నే తలపిస్తోంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఒకరిపై మరోకరు మాటల తూటలతో ఎన్నికల హీట్ పెంచుతున్నారు. మరోవైపు, ఎన్నికల్లో నాయకులు హామీల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల హామీలో భాగంగా తాను ఈ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకం రైతుల పెన్షన్ పైనే పెడతానని పవన్ కళ్యాన్ ప్రకటించారు. బుధవారం జిల్లాలోని గిద్దలూరులో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలెండర్, ప్రకాశం జిల్లా కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ఆ తర్వాత ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “జగన్ మాట్లాడితే, నన్ను ‘యాక్టర్’ అంటారు. నేను కాదనడం లేదు. మరి, రెండు సంవత్సరాలు జైల్లో ఉండొచ్చిన మీరు మహాత్మాగాంధీయా? మీరు ఏం చేశారు?” అని ప్రశ్నించారు.

“అలాగే జగన్ మాట్లాడితే నన్ను ‘టీడీపీ పార్టనర్’ అంటారు. అసలు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరి పార్టనర్ అనాలి? మోడీ పార్టనరా? అమిత్ షా పార్టనరా? టీఆర్ఎస్ పార్టనరా?” అని ప్రశ్నించారు. “ఈ ముగ్గురితో పార్టనర్ అయిన జగన్ మోహన్ రెడ్డికి నేనొకటి చెబుతున్నా, నేను యాక్టర్ నే. అది వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాను. నేను చదువుకుంది పదో తరగతే. కానీ, నా చదువు ఆపలేదు. పబ్లిక్ పాలసీల గురించి నేను చదువుకుంటూనే ఉన్నా. ఏం తెలియకుండా, అర్థం చేసుకోకుండా రాజకీయాల్లోకి మేము వస్తామా? ఈ తరానికి అండగా ఉండేందుకు వచ్చాను” అని అన్నారు.