మెదక్ లోక్‌సభ స్థానానికి దేశంలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచి.. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మెదక్‌తో ఆమెది విడదీయరాని అనుబంధం. 1975లో ఎమర్జెన్సీ విధించిన నాటి ప్రధాని ఇందిర దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసిన ఇందిర కూడా ఓటమిపాలయ్యారు. తొలిసారి కేంద్రంలో కాంగ్రేసేతర జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. కానీ రెండేళ్లకే 1979లో ఆ ప్రభుత్వం కుప్పకూలింది. 1980లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఉత్తరాదిలో జనతా పార్టీ ప్రాబల్యం అధికంగా ఉండటంతో కాంగ్రెస్ దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీ ముఖ్యనేతలంతా మెదక్ నుంచి పోటీ చేయాలని ఇందిరను ఆహ్వానించారు.
ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 3 లక్షలకు పైగా మెజారిటీతో ఆమె విజయం సాధించారు. నాడు జనతా పార్టీ తరఫున మెదక్ నుంచి ఇందిరపై పోటీ చేసిన ఎస్.జైపాల్‌రెడ్డి 82,453 ఓట్లు మాత్రమే సాధించారు. గణిత మేధావి శకుంతలాదేవి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడు పీవీ రాజేశ్వర్‌రావు, తొలితరం తెలంగాణ ఉద్యమ నేత, కేశవ్ రావు జాదవ్ కూడా పోటీ చేశారు. మెదక్‌తో పాటు రాయ్‌బరేలీలోనూ ఇందిర గెలిచారు. రాయ్‌బరేలీ స్థానానికి రాజీనామా చేశారు. మెదక్ నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 42 లోక్‌సభ స్థానాలకుగాను 41 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. మెదక్ అభివృద్ధిపై ఇందిర ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాని హోదాలో అయిదుసార్లు నియోజకవర్గంలో పర్యటించారు.ఆమె హయాంలోనే సంగారెడ్డి మండలం ఎద్దుమైలారంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. ఆల్విన్ మహేంద్ర లోకోమోటివ్ కేంద్రం పూర్తయింది. పారిశ్రామికవాడగా పటాన్‌చెరు అభివృద్ధికి బాట ఏర్పడింది. 1984లో ఇందిర హత్యకు గురవ్వడంతో మెదక్‌తో ఆమె అనుబంధం శాశ్వతంగా వీడినట్టయింది.