ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, తన పార్టనరైన యాక్టర్‌తో పొత్తు పెట్టుకున్నామనే విషయాన్ని బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఆరోపించారు.
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలోమాట్లాడుతూ ఆయన.. బాబు పార్టనర్ యాక్టర్ నామినేషన్ వేయటానికి వెళితే వచ్చేది టీడీపీ కార్యకర్తలే అని తెలిపారు. ఆయన పార్టనర్ చంద్రబాబుతో 4 ఏళ్ళు కాపురం చేస్తాడు, ఆఖరు సంవత్సరం విడిపోయినట్లు నటిస్తున్నారన్నారు.
చంద్రబాబుపై వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తే, తనపై గత 5 ఏళ్లలో 22 కేసులు పెట్టారని జగన్ వివరించారు. ఆఖరు సంవత్సరంలో చంద్రబాబు పార్టనర్ పోరాటాలుచేస్తే ఒక్క కేసు కూడా పెట్టడని… వీళ్ల డ్రామాలు ఒక్కసారి గమనించాలని జగన్ ఓటర్లను కోరారు.
గత ఐదేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగిందని ఆరోపించారు. పురాణాల్లో రావణాసురుడికి 10 తలలు ఉంటే టీడీపీ అధినేత నారాసురుడు చంద్రబాబు నాయుడుకు 10 తలలు విడివిడిగా ఉంటాయని అన్నారు. ఒకటి ఆయన తలమీద ఉంటే, ఇంకోకటి పెయిడ్ యాక్టర్ పార్టనర్ దగ్గర ఉంటుంది. ఇంకో తల రాజగురువు రూపంలో ఈనాడు అధిపతి దగ్గర ఉంటుందన్నారు.