ఎన్నికల సంఘంతో చంద్రబాబు ఢీ… తాడోపేడో తేల్చుకుంటాం..

0
55

కేంద్ర ఎన్నికల సంఘంతో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా తలపడ్డారు. ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఈసీ జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేశారు.

ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఈసీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మంగళవారం రాత్రి ఉత్తర్వులిచ్చిన సర్కార్ దాని మార్చి బుధవారం మరో జీవోను విడుదల చేసింది. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని పేరున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని ప్రభుత్వం నిలిపివేసింది.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని డీజీపీ మొదలు కానిస్టేబుల్ వరకు మొత్తం పోలీస్ సిబ్బందిని ఈసీ పరిధిలోకి తెస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అందులో ఇంటెలిజెన్స్ వ్యవస్థకు మినహాయింపునిచ్చింది. ఈసీ ఆదేశాలను ధిక్కరిస్తూ ఏపీ సర్కార్ వరుస జీవోలు విడుదల చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.

ఏపీ పోలీసుల్లో కొందరు సీఎం చంద్రబాబు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు ఐపీఎస్‌లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఈసీ మంగళవారం ఆదేశాలిచ్చింది. తొలుత ఈ ఆదేశాలకు అనుగుణంగా ముగ్గురు ఐపీఎస్‌లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ మంగళవారం రాత్రి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్రపునేఠా ఉత్తర్వులు ఇచ్చారు.

ఆ తర్వాత న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన చంద్రబాబు… ఇంటెలిజెన్స్ చీఫ్ ఎన్నికల కమిషన్ పరిధిలోకి రారని మెలికపెట్టింది. ఈసీ పరిధిలోకి అన్ని పోలీస్ విభాగాలను చేర్చినా.. ఇంటెలిజెన్స్‌కు మినహాయింపు ఇస్తూ బుధవారం జీవో నంబర్ 720ను జారీచేసింది. తమకు అనుకూలమైన అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించకుండా ఉండేందుకే ఏపీ సర్కార్ ఈ వివాదాస్పద జీవోల యుద్ధానికి తెరతీసినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరోవైపు వెంకటేశ్వరరావును బదిలీచేస్తూ ఈసీ తీసుకొన్న నిర్ణయంపై బుధవారం ఏపీ హైకోర్టులో ఏపీ సర్కార్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన హైకోర్టు.. ఏబీ వెంకటేశ్వరరావుకు ఎన్నికల విధులు కేటాయించలేదని తెలిపే అధికారిక ఉత్తర్వులు దాఖలుచేయాలని ప్రభుత్వాన్ని, బదిలీ ఆదేశాల సమాచారాన్ని అఫిడవిట్‌గా అందజేయాలని ఈసీని ఆదేశించింది. తమను ప్రతివాదులుగా చేర్చాలని వైసీపీ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై వాదనలు తర్వాత వింటామని తెలిపింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.